తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న జనగామలో జరిగిన లాఠీఛార్జ్ కు నిరసనగా చలో జనగామకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు జనగామలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన బిజెపి కార్యకర్తలను పరామర్శించడానికి జనగామ ఏరియా ఆసుపత్రికి వచ్చిన బండి సంజయ్, అక్కడ లాఠీఛార్జి కు సంబంధించిన విషయాలను కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి వద్ద భారీగా మోహరించిన పోలీసులతో, బీజేపీ శ్రేణులతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.
ఆసుపత్రిలో కార్యకర్తలను పరామర్శించిన సంజయ్ వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇదే సమయంలో సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బండి సంజయ్ ఆధ్వర్యంలో జనగామ పోలీస్ స్టేషన్ ముందు నుండి డి సి పి కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించారు. డి సి పి కార్యాలయం వద్ద బిజెపి నేతలు ఒక్కసారిగా గేట్ ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఆందోళనకారులను అదుపు చేయడానికి ప్రయత్నం చేశారు. డిసిపి కార్యాలయం లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.ఈ క్రమంలో మాట్లాడిన బండి సంజయ్ సీఐ పై చర్యలు తీసుకోకపోతే ఏం చేస్తామో చెప్పమని చేసి చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో వివేకానంద జయంతిని ప్రభుత్వం ఏమైనా నిషేధించిందా అంటూ ప్రశ్నించిన ఆయన, జనగామ మున్సిపల్ కమిషనర్ మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాదు శాంతియుతంగా ఆందోళన తెలుపుతున్న కార్యకర్తలపై విచక్షణరహితంగా లాఠీఛార్జి చేసి చితకబాదారు అని బండి సంజయ్ ఆరోపించారు.
\