కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు మంత్రి కేటీఆర్ లేఖ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, January 08, 2021

కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు మంత్రి కేటీఆర్ లేఖ

 


కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. గతంలో హైదరాబాద్‌కు రావాల్సిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్‌వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్టు రద్దు కావడంపై మంత్రి కేటీఆర్‌ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 2014 నుంచి ఐటీఐఆర్ పైన కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానం లేదని, కనీసం ఇప్పటికైనా ఐటీఐఆర్‌ను పునరుద్ధరించడం లేదా అంతకు మించి మేలైన మరొక కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. 2008లో కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుందని ఇందుకు సంబంధించి 2010లో హైదరాబాద్, బెంగళూరు నగరాలను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేసిందని గుర్తు చేశారు.


ఐటీఐఆర్ కోసం 49 వేల ఎకరాలతో పాటు మూడు క్లస్టర్ లను హైదరాబాద్‌లో గుర్తించడం జరిగిందన్నారు. తద్వారా అనేక నూతన ఐటీ కంపెనీలను నగరానికి రప్పించేందుకు, పెట్టుబడులకు ప్రోత్సాహకంగా పలు కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కేటీఆర్ తెలిపారు. సుమారు రూ.3,275 కోట్లతో వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, ఇందుకు సంబంధించి రెండు దశల్లో ఈ నిధులను ఖర్చు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు.


ఇందులో భాగంగా మొదటి దశ కార్యక్రమానికి సంబంధించి రూ.165 కోట్లతో 2018 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుందని, మిగిలిన రెండవ దశకు సంబంధించి వివిధ దశలుగా 20 సంవత్సరాల్లో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఐటీఐఆర్ మొదటి దశలో భాగంగా గుర్తించిన పలు అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ రైల్వే, రోడ్డు ర‌వాణా శాఖలకు సంబంధించి అదనపు బడ్జెట్ నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే వస్తుంద‌ని అన్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభం కాలేదని తెలిపారు. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇప్పటి వరకు హైదరబాద్‌లో ఐటీఐఆర్ కార్యక్రమాలు ప్రారంభం కాలేదని తెలిపారు.