విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతేడాది మార్చి రెండో వారం నుంచి మూతబడ్డ విద్యా సంస్థలు... వచ్చేనెల ఒకటో తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. సుదీర్ఘకాలం మూతబడి ఉండటంతో చెట్లు, పొదలు పెరిగాయి. తరగతి గదులు, బెంచీలు దుమ్ముపట్టాయి. అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో స్వచ్ఛత కార్యక్రమాన్ని స్థానిక సంస్థలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాల/ కళాశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్ వినతికి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలన్నీ కలిపి 30 వేల వరకు ఉన్నాయి. ఇవన్నీ దాదాపు పది నెలలకు పైగా మూతబడి ఉన్నాయి. ఆన్లైన్ బోధన సాగుతున్న క్రమంలో విద్యా సంస్థలను తెరిచి ఉపాధ్యాయుల హాజరుకు అనుమతిచ్చినప్పటికీ పారిశుధ్యంపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో బోధన సిబ్బంది కూర్చునే హాల్, రెస్ట్రూమ్ వరకు శుభ్రం చేశారు. విద్యార్థుల తరగతి గదులు, ప్లేగ్రౌండ్ శానిటైజేషన్‌ను పట్టించుకోలేదు.