హైదరాబాద్.. ప్రపంచ నగరాలతో పోటీ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, January 06, 2021

హైదరాబాద్.. ప్రపంచ నగరాలతో పోటీ
 హైదరాబాద్.. ప్రపంచ నగరాలతో పోటీ పడుతోంది. ఎన్నో విషయాలలో భాగ్యనగరం అభివృద్ధి చెందుతూ వెళుతోంది. ప్రజలకు రక్షణ విషయంలో ప్రపంచం లోని చాలా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ బెటర్ అని నిపుణులు అంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాల్లో రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో చెన్నై ఉండటం మరో విశేషం. రెండు దక్షిణాది నగరాలకు జాబితాలో చోటు దక్కింది. యూకేకి చెందిన 'సర్ఫ్‌షార్క్‌'సంస్థ అంతర్జాతీయంగా 130 నగరాల్లో సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించింది. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానం అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం, పోలీసుశాఖ ముందుకు వెళుతోంది. అందులో భాగంగానే నగరంలోని చాలా ప్రాంతాలను సీసీ కెమెరాలతో కవర్ చేశారు. ఎప్పటికప్పుడు నిఘా ఉంచడంలో హైదరాబాద్ పోలీసులు కూడా సక్సెస్ అయ్యాయి. ఏర్పాటులో ఈ సరికొత్త మైలురాయి అందుకున్నాయి. నగరంలో ప్రతీ చదరపు కిలోమీటరుకు 480, వెయ్యి మందికి 30 సీసీ కెమెరాలు ఉన్నాయని సర్వే స్పష్టం చేసింది. సంఖ్య పరంగా చూస్తే చెన్నై కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ సీసీ కెమెరాలున్నాయి. చెన్నై విస్తీర్ణం 426 చదరపు కి.మీ. మాత్రమే.. హైదరాబాద్‌ది 625 చదరపు కి.మీ. ప్రతి చదరపు కి.మీ.కి ఉన్న కెమెరాల అంశంలో చెన్నై మొదటి స్థానం ఆక్రమించింది. చదరపు కిలోమీటరుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంఖ్య, అక్కడి జనాభాను ప్రామాణికంగా తీసుకున్న సర్ఫ్‌షార్క్‌ సంస్థ 130 నగరాలతో జాబితా రూపొందించింది.


వివిధ బహుళజాతి, అగ్ర దేశాల వ్యాపార, పరిశోధన సంస్థలు హైదరాబాద్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. సురక్షిత నగరంగా పేరు సంపాదిస్తే పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని భావించి ప్రజాభద్రతా చట్టం కింద సీసీ కెమెరాల ఏర్పాటును ప్రభుత్వం, పోలీస్‌ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆ విధంగా ముందుకు వెళ్లారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనేది తెలంగాణ పోలీసుశాఖ సంకల్పమని.. ఇప్పటిదాకా 6.65 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని డీజీపీ డాక్టర్‌ ఎం మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇక నేరస్థులను పట్టుకోవడంలో తెలంగాణ పోలీసులకు ఈ సీసీటీవీలు ఎంతో సహాయం చేశాయి.