భాగ్యనగరవాసులకు సంక్రాంతి పండగ ముందుగానే వచ్చేసింది. ఇచ్చిన హామీ ప్రకారమే టీఆర్ఎస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీలో పరిధిలో ఉచిత తాగునీటి పంపిణీ పథకం ప్రారంభించింది. నగరంలోని రెహమత్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్లో 10 లక్షల నల్లా కనెక్షన్లకు ఉచిత తాగునీరు అందిస్తున్నామన్నారు. ఉచిత తాగునీటి పథకంతో గ్రేటర్లో 97 శాతం మందికి లబ్ధి చేకురుతుందన్నారు. ఉచిత తాగునీరు కావాలంటే మార్చి 31 లోపు.. తప్పనిసరిగా మీటర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
స్లమ్, బస్తీ ప్రజలకు మీటర్ అవసరం లేదన్నారు. 20 వేల లీటర్లు దాటితే బిల్లు కట్టాలని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌కు రెండ్రోజుల ముందే సంక్రాంతి వచ్చిందన్నారు కేటీఆర్. తాను చదువుకునే రోజుల్లో తాగునీటి కోసం ధర్నాలు జరిగేవని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం నగరంలో ఉచితంగా తాగునీరు అందించే స్థాయికి చేరుకున్నామన్నారు. కులమతాలకు అతీతంగా పేదలంతా అభివృద్ధి చెందాలన్నదే తమ పార్టీ, ప్రభుత్వం ధ్యేయమని స్పష్టం చేశారు. బస్తీల్లోని పేదలకోసం అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. బలహీన వర్గాల పిల్లలను విదేశాలకు పంపి చదివిస్తున్నాం అని కేటీఆర్ వివరించారు.