హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కార్పొరేటర్ల పేర్లకు ఆమోద ముద్ర పడింది. గత నెల జరిగిన ఎన్నికల్లో గెలిచిన 150 మం ది కార్పొరేటర్ల పేర్లతో రాష్ట్ర ఎన్నికల సం ఘం గెజిట్ జారీ చేసింది. దీంతో నూతన పాలకవర్గం కొలువుదీరే ప్రక్రియలో మరో అంకం పూర్తయ్యింది. ఇక... తాజా పాలకవర్గం గడువు ముగిసిన వెంటనే కొత్త పాలకవర్గం సమావేశానికి నోటిఫికేషన్ జారీ కానుంది. అందుకు అనుగుణంగా జరిగే సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ముగియడంతో నూతన పాలకవర్గం కొలువుదీరనుంది. వచ్చే నెల పదో తేదీ వరకు తాజా పాలకవర్గమే అధికారికంగా కొనసాగనుంది.
కొత్త కార్పొరేటర్లకు అధికారిక ముద్ర
గత ఏడాది డిసెంబరు ఒకటో తేదీన పోలింగు జరిగిన విషయం తెలిసిందే. ఆపై నాలుగో తేదీన గ్రేటర్ ఎన్నికల ఫలితాలొచ్చాయి. సాంకేతిక కారణాలతో అదేరోజు 149 మంది డివిజన్లలో గెలిచిన అభ్యర్థులకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రాలు జారీ చేశా రు. ఈ మేరకు గ్రేటర్ ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ గెలిచిన అభ్యర్థుల జాబితాను గత నెల ఐదున రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపా రు. కాని, నేరెడ్మెట్ (డివిజన్ నెంబరు 139) ఫలితం పై ఐదు రోజుల పాటు ఉత్కంఠ నెలకొంది. తుదకు హైకోర్టు తీ ర్పుతో గత నెల 9వ తేదీన నేరెడ్మెట్ డివిజన్ ఫలితాల్ని కూ డా ప్రకటించారు. అయితే, తాజా పాలకవర్గం గడువు వచ్చే నెల పదో తేదీన ముగియనుండటంతో గెలిచిన వారిని అధికారికంగా కార్పొరేటర్లుగా గుర్తించే ప్రక్రియ చేపట్టలేదు. తాజా పాలకవర్గం గడువు సుమారు 25 రోజు ల్లో ముగియనున్న దరిమిలా గ్రేటర్‌లోని 150 డివిజన్లలో గెలిచిన అభ్యర్థుల్ని కార్పొరేటర్లుగా ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారధి గెజిట్ జారీ చేశారు. దీంతో గత నెల జరిగిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు తాజా గెజిట్ జారీతో కొత్త కార్పొరేటర్లుగా అధికారిక ముద్ర వేసుకున్నట్లయింది.
తొలుత ప్రమాణ స్వీకారం
కొత్త కార్పొరేటర్ల పేర్లతో గెజిట్ జారీ అయిన నెల రోజుల్లోపే నూతన పాలకవర్గం తొలి సమావేశం జరగాల్సి ఉందని అధికారులు తెలిపారు. అంటే గెజిట్ శనివారం (16వ తేదీ) జారీ అయినందున వచ్చే నెల 16 లోపుగానే నూతన పాలకవర్గం కొలువుదీరనుందనేది సుస్పష్టం.
జాబితా రూపకల్పనపై దృష్టి..
తాజాగా గెజిట్ జారీ కావడం, నూతన పాలకవర్గం కొలువుదీరేందుకు నెల రోజుల్లోపే సమ యం ఉండటంతో ఎక్స్-ఆఫీషియో సభ్యుల జాబితాపై ప్రస్తుతం గ్రేటర్ అధికారులు దృష్టి సారించారు. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఓటరు జాబితాలో పేరు నమో దు చేసుకొని ఉండటమనేది ఎక్స్-ఆఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకునేందుకు కనీస అర్హతగా అధికారులు పేర్కొన్నారు. దీంతో పాటు సదరు ప్రజాప్రతినిధి గ్రేటర్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్స్-అఫీషియోగా తన ఓటు హక్కును వినియోగించుకొని ఉండొద్దని వివరించారు.
కోరం ఉంటేనే తొలి సమావేశం..
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం తదుపరి జారీ కానున్న నోటిఫికేషన్లో సమావేశ నిర్వహణకు కనీసంగా మూడు రోజుల గడువు ఇచ్చే అవకాశముంది. అంటే కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులందరికీ మూడు రోజుల ముందే సమాచారం అందిస్తారు. అయితే కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియోలతో కూడిన ఓటరు జాబితాలో ఉండే సంఖ్యలో, కనీసంగా సగం మంది (కోరం) ఉంటేనే సమావేశాన్ని నిర్వహిస్తారు. సమావేశంలో కార్పొరేటర్లుగా గెలిచిన వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే ఎన్నిక ప్రక్రియను మొదలుపెడతారు. సమావేశంలో మేయర్ అభ్యర్థిని ఒక సభ్యుడు ప్రతిపాదిస్తే, మరొక సభ్యుడు మద్దతు తెలుపాల్సి ఉంటుంది. మేయర్, డిప్యూటీ మేయర్ల పదవి కోసం కార్పొరేటర్‌కు మాత్రమే అర్హత ఉంటుంది. ఎక్స్ అఫీషియోలకు అవకాశం లేదు. అభ్యర్థులు నామినేషన్లు సమర్పించిన తర్వాత... పార్టీలు విప్‌లు జారీ చేస్తాయి. గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే విప్ జారీ చేసే అధికారం ఉంటుంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సమావేశంలో చేతులు ఎత్తడం విధానంలో ఎన్నిక నిర్వహిస్తారు.