టీఆర్ఎస్‌కు కమ్ బ్యాక్.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, January 20, 2021

టీఆర్ఎస్‌కు కమ్ బ్యాక్..
 గతేడాది నవంబర్ 28న ఎల్బీ నగర్ బహిరంగ సభ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకూ మళ్లీ జనం ముందుకు రాలేదు. అప్పటినుంచి ఇప్పటివరకూ ఆయన ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఇటీవల ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. దీంతో సీఎం కేసీఆర్ ఎక్కడా కనిపించట్లేదు,ఎవరికీ వినిపించట్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుబ్బాక,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు బోల్తా కొట్టిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కువగా ఫాం హౌస్‌కే పరిమతమవుతున్నారన్న ప్రచారం ఉన్నది. అయితే కేసీఆర్ ఒక అడుగు వెనక్కి వేశారంటే... పది అడుగులు ముందుకు పడుతాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. మౌనంగా వ్యూహాలు రచించడంలో ధిట్ట అయిన కేసీఆర్ 'నాగార్జున సాగర్' ఉపఎన్నిక కోసం గట్టి వ్యూహమే రచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24-26 తేదీల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా మండలంలో బహిరంగ సభ నిర్వహించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం.నాగర్జునసాగర్ ఉపఎన్నిక సమరాన్ని బహిరంగ సభతో మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు జనవరి 24-26 తేదీల్లో హాలియా మండల కేంద్రంలో దాదాపు లక్షన్నర మందితో బహిరంగ సభ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. సభ నిర్వహణ తేదీపై మంగళ(జనవరి 19) లేదా బుధవారం(జనవరి 20) స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సోమవారం(జనవరి 18) మంత్రి జగదీశ్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయి బహిరంగ సభపై చర్చించారు.బహిరంగ సభ ఏర్పాట్లు,జన సమీకరణపై మంత్రి కేటీఆర్ ఇప్పటికే నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు స్పష్టమైన సూచనలు చేశారు.సభ పర్యవేక్షణ బాధ్యతలను మాజీ ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, సోమ భరత్‌కుమార్‌ గుప్తా తదితరుల నేతృత్వంలోని కమిటీకి అప్పగించినట్లు తెలుస్తోంది. దాదాపు నెలన్నర రోజులకు పైగా ప్రజలకు ముందుకు రాని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభతో అటు పార్టీలో,ఇటు ప్రజల్లో గులాబీ జోష్‌ను నింపాలనే యోచనలో ఉన్నారు.నల్గొండ ఉపఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాకముందే కేసీఆర్ బహిరంగ సభకు సిద్దమవడం వ్యూహాత్మకంగానే కనిపిస్తోంది. దుబ్బాకలో కేసీఆర్ అసలు ప్రచారానికే వెళ్లకపోవడం,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో క్లైమాక్స్‌లో ఒకే ఒక్క బహిరంగ సభలో ఆయన పాల్గొనడం తెలిసిందే. అయితే నాగార్జునసాగర్ ఉపఎన్నికకు మాత్రం హాలియా బహిరంగ సభతో తానే గేమ్ షురూ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ బహిరంగ సభతో ఉపఎన్నికకు ఎజెండా ఫిక్స్ చేసి ప్రతిపక్షాలకు గట్టి సవాల్ విసిరే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పదునైన వ్యూహాలతో ఆయన సిద్దమయ్యారని... ఈ బహిరంగ సభతో కేసీఆర్ గర్జన ఎలా ఉంటుందో మరోసారి ఆయన రుచి చూపించబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నల్గొండ జిల్లాకు కేసీఆర్ భారీ వరాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.