తెలంగాణలో బలం పెంచుకుంటున్న బీజేపీ..భయందోలనలో కే టి ఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 09, 2021

తెలంగాణలో బలం పెంచుకుంటున్న బీజేపీ..భయందోలనలో కే టి ఆర్తెలంగాణలో బలం పెంచుకుంటున్న బీజేపీ.. దూకుడుగా పార్టీ కార్యక్రమాలను చేపడుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయంతో.. టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని బలంగా చెబుతోంది. త్వరలోనే జరగబోయే నాగార్జునసాగర్ ఉపఎన్నికతోపాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలపై బీజేపీ కన్నుపడింది. అందుకే బండి సంజయ్ ఈ నగరాల్లో పర్యటిస్తున్నారు.


వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తామని చెబుతున్న బీజేపీ నేతలు.. టీఆర్ఎస్‌ను టార్గెట్ చేశారు. చిన్న సందర్భాన్ని సైతం వదలకుండా గులాబీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించాలని ఇటీవలే ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.


తాజాగా మంత్రి కేటీఆర్‌కు సైతం బీజేపీ సెగ తాకింది. ముషీరాబాద్‌లో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి వెళ్లిన కేటీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రోటోకాల్ పాటించడం లేదని ఆందోళన చేపట్టారు. బదులుగా టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తతలు తలెత్తాయి.


బాగ్‌లింగంపల్లి లంబాడితండాలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవంలోనూ కేటీఆర్ గో బ్యాక్ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. జీహెచ్‌ఎంసీకి కొత్త పాలకమండలిని ఏర్పాటు చేయాలని.. తమకు ప్రొటోకాల్‌ కల్పించాలని బీజేపీ కార్పొరేటర్లు కేటీఆర్ పర్యటన సందర్భం నిరసన తెలిపారు. శిలాఫలకాలపై తమ పేర్లు పెట్టాలని కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.


ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ...‘‘ఎన్నికల సమయంలో ఎవరి వాదన వారు చెప్పాం. ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజల సంక్షేమం, అభివృద్ధే ముఖ్యం. రాజకీయాల్లో పోటీతత్వం ఉండాలి. అనవసర పంచాయతీలు వద్దు. ప్రజలు కూడా హర్షించరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ప్రజలు హర్షిస్తార’’నడం గమనార్హం.