బీజేపీకి చెక్ పెట్టేందుకు.. ‘బండి’పైకి సరికొత్త అస్త్రాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 07, 2021

బీజేపీకి చెక్ పెట్టేందుకు.. ‘బండి’పైకి సరికొత్త అస్త్రాలు
 దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీ జోరు మీదుంది. అధికార టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తోంది. నాగార్జునసాగర్ ఉపఎన్నికతోపాటు.. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలపై కమలం పార్టీ గురిపెట్టింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీతో ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించిన కేసీఆర్.. ఢిల్లీ పర్యటన తర్వాత సైలెంటయ్యారు. సాగు చట్టాలకు అనుకూలంగా వ్యవహరించడంతోపాటు.. ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో అమలు చేస్తామని కేంద్రానికి తెలిపారు.


కేసీఆర్ ఢిల్లీ టూర్‌ ముందు వరకూ మంత్రులు, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగేది. బీజేపీ నేతల మాటలకు టీఆర్ఎస్ మంత్రులు గట్టిగా కౌంటర్ ఇచ్చేవారు. కానీ గులాబీ బాస్ హస్తిన పర్యటన తర్వాత సీన్ మారింది. బీజేపీ నాయకులను మంత్రులు విమర్శించడం మానేశారు. ఎవరైనా విమర్శిస్తే.. వద్దని కేసీఆర్ వారిస్తున్నారని సమాచారం. అనవసరంగా బండి సంజయ్‌ను హీరో చేయొద్దని.. మీ స్థాయికి ఆయనపై విమర్శలు ఏంటని..? మంత్రులతో కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

స్వయంగా సీఎం వద్దని చెప్పడంతో.. బీజేపీ నేతల విషయంలో మంత్రులు ఆచితూచి మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ నేతల వైపు నుంచి మాటల దాడి ఆగకపోవడంతో.. టీఆర్ఎస్ అధినేత వ్యూహం మార్చారు. మంత్రులను సైలెంట్‌గా ఉండమని చెబుతూనే.. అంత కంటే దిగువ స్థాయి నేతలతో ఎదురు దాడి చేయిస్తున్నారు.

ప్రభుత్వ చీఫ్ విప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, విప్ బాల్కా సుమన్ తదితరులు బండి సంజయ్‌ను టార్గెట్‌గా చేసుకొని మాటల తూటాలు పేలుస్తున్నారు. సంయమనం పాటిస్తున్నామంటూనే.. నువ్వు ఒకటంటే నేను నాలుగు అంటా అన్నట్లుగా విమర్శలు, పరుష పదజాలంతో విరుచుకు పడుతున్నారు. బీజేపీ నేతలు తమను విమర్శించినా.. ఘాటుగా బదులిచ్చే పరిస్థితి లేనందుకు ఇబ్బంది పడుతున్న మంత్రులు.. బాల్కా సుమన్ లాంటి నేతల విమర్శలతో సంతృప్తి చెందుతున్నారేమో.